ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన హర్షకుమార్

కాకినాడ: ఎట్టకేలకు మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీలో చేరారు. కాకినాడలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో హర్షకుమార్ టీడీపీలో చేరారు. హర్షకుమార్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరానని, చంద్రబాబు ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశారని ఆరోపించారు. పోలీసుల విచారణలో న్యాయం జరగకపోతే.. సీబీఐ విచారణ కోరవచ్చని ఆయన సూచించారు. దురుద్దేశంతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని హర్షకుమార్‌ ధ్వజమెత్తారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, ఎంపీ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. అయితే హర్షకుమార్‌కు అమలాపురం ఎంపీ టికెట్ ఖయమైందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్ హామీతోనే హర్షకుమార్ టీడీపీ చేరినట్లు తెలుస్తోంది.

అమలాపురం సిటింగ్‌ ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి ఎవరిని పోటీ పెట్టాలనే విషయాన్ని పార్టీ సీరియస్‌గా ఆలోచిస్తోంది. దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌ పేరు తెర మీదకు వచ్చింది. కానీ కొందరు ఆయనను అమలాపురం ఎమ్మెల్యే స్థానానికి పంపాలని ఒత్తిడి చేస్తుండడంతో సందిగ్ధం ఏర్పడింది. ఈలోపు కొత్త పేరు తెరమీదకు వచ్చింది. అనూహ్యంగా హర్షకుమార్‌ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే కొంతమంది ఆయనతో  టీడీపీ నేతలు మంతనాలు జరిపారు. ఆయన కూడా సుముఖంగా ఉన్నారు. సీఎం నుంచి పిలుపు వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నుంచి పిలుపురావడంతో ఆయన టీడీపీ చేరినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.