ఆంధ్రప్రదేశ్

టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ముళ్లపూడి బాపిరాజు!

  • తాడేపల్లి గూడెం టికెట్ ఈలి నానికి ఖరారు
  • మనస్తాపానికి గురైన బాపిరాజు
  • ముఖ్య అనుచరులతో భేటీ

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను తెలుగుదేశం పార్టీ అధినేత ఈలి నానికి ఖరారు చేయడంపై, అదే స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న చంద్రబాబుతో బాపిరాజు భేటీ అయిన వేళ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈలి నానికి టికెట్ ఇస్తున్నామని, ఆయన్ను గెలిపించాలని, భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు.
అయినప్పటికీ, తీవ్ర మనస్తాపానికి గురైన బాపిరాజు, ఈ ఉదయం తన ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు. నేడు, రేపు సమీక్షల తరువాత ఆయన తన నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. కాగా, 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా తాడేపల్లి గూడెం స్థానాన్ని తెలుగుదేశం వదులుకోగా, పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే స్థానం కోసం టీడీపీలో పలువురు నేతలు పోటీ పడుతుండగా, ఈలి నానిని చంద్రబాబు ఎంపిక చేశారు