టీఆర్ఎస్ పార్టీలో టికెట్ మంట రాజుకుంది. వచ్చే ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ లు అందరికీ మళ్లీ అవకాశం కల్పించిన కేసీఆర్ ఓ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వకుండా నిరాకరించారు. ఇలా నిరాకరణకు గురైన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నల్లాల ఓదేలు ఒకరు. కేసీఆర్ నిర్ణయంతో ఓదేలుతో పాటు అతడి అనుచరులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. తమ నాయకుడిని కాదని ఎంపి బాల్క సుమన్ కు టికెట్ కేటాయంచడంపై నల్లాల ఓదేలు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికే టికెట్ కేటాయించాలను నిరసనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే చెన్నూరు నియోజకవర్గం నుంచి సీటు పొందిన బాల్క సుమన్ ప్రచారానికి సిద్దమయ్యాడు. అయితే ఇందారంలో బాల్క సుమన్ ప్రచారాన్ని అడ్డుకుంటూ నల్లాల ఓదేలు అనుచరులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇదే సమయంలో బాల్క సుమన్ ఎన్నికల ప్రచార నిమిత్తం అక్కడికి చేరుకున్నారు.ఈ ప్రచారంలో నల్లాల ఓదేలుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆయన అనుచరుడు గట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతణ్ని అడ్డుకునే ప్రయత్నంలో కొంత మంది టీఆర్ఎస్ కార్యకర్తలపైనా కిరోసిన్ పడింది. ఇదే సమయంలో ఓ హారతి పళ్లెంలోని కర్పూరంపైనా కిరోసిన్ పడటంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఘటనలో గట్టయ్యతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో పదుల సంఖ్యలో గాయపడ్డారు.. దాడి నుంచి ఎంపీ సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ లు తృటిలో తప్పించుకోగా.. ఆత్మాహుతి దాడి నుంచి వారిని కాపాడే క్రమంలో శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్ కు గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న కొంతమంది మహిళలతో పాటు ప్రోగ్రాంను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై పెట్రోల్ పడి.. రెప్పపాటులోనే మంటలు అంటుకున్నాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు