తెలంగాణ

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం రాజ్యంగ బద్ధమే

సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని విభేదించి  టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గ్రూపు రాజకీయాలు, నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోందన్నారు. భవిష్యత్‌పై భరోసా లేకే పార్టీ మారామని, అవసరమైతే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం..సీఎల్పీని విలీనం చేయాలని కోరామని, చట్ట ప్రకారం విలీనం జరిగినా ఇప్పటి వరకు టీఆర్ఎస్  కండువా కప్పుకోలేదన్నారు. పదవుల కోసం చిల్లర మల్లరగా తిడితే ఊరుకునేది లేదని, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవ జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోలేక పోయిందని ఎద్దేవా చేశారు.
మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకే తాము పార్టీ మారామని వివరించారు.‘‘2014 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోతోంది. వరుస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు. ఎంతో మంది నేతలు పార్టీ మారుతున్నా.. ఉత్తమ్‌ వ్యవహారశైలి మారటం లేదు. మాపై అనవసర విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ నేతలపై పరువునష్టం దావా వేస్తాం. మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ తెరాస ఘన విజయం సాధించింది. ఈనెల 6కంటే ముందు మేము కాంగ్రెస్‌లో చేరలేదు. ఈనెల 6న ఒకే సారి 12 మంది ఎమ్మెల్యేలం టీఆర్ఎస్ లో చేరాం.’’ అని వివరించారు. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, ఆత్రం సక్కం, సుధీర్‌రెడ్డితో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా సమావేశంలో పాల్గొన్నారు.