జాతీయంవ్యాపారం

‘జెట్‌’ గురించి మీడియాతో మాట్లాడొద్దు

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం గురించి ఎవరూ మీడియాతో మాట్లాడరాదంటూ ఆ సంస్థ తమ సిబ్బందికి సూచించింది. జెట్‌ కొనుగోలు ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జెట్‌ తాత్కాలిక మూసివేతతో సంస్థ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. కార్యకలాపాల రద్దును నిరసిస్తూ ముంబయి, దిల్లీల్లో జెట్‌ సిబ్బంది ఆందోళన చేపట్టారు. వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు.

దీంతో ఉద్యోగుల నిరసనపై స్పందించిన ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మీడియాకు దూరంగా ఉండాలని సూచించింది. ‘మన ఎయిర్‌లైన్స్‌ను అందరూ ఇష్టపడుతున్నారు. జెట్ సంక్షోభం గురించి వార్తపత్రికలన్నీ రోజూ కథనాలు రాస్తున్నాయి. ప్రస్తుతం మనం చాలా క్లిష్టమైన దశలో ఉన్నాం. జెట్‌ కొనుగోలు కోసం మన రుణదాతలు బిడ్డింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఇలాంటి సమయంలో మీరంతా మీడియాకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. కేవలం కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ విభాగంలోని సిబ్బంది మాత్రమే మీడియాతో మాట్లాడతారు’ అని కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ విభాగం సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు అత్యవసరంగా రూ. 400కోట్ల నిధులు ఇచ్చేందుకు రుణదాతలు అంగీకరించలేదు. దీంతో కార్యకలాపాలు సాగించలేదని స్థితిలో జెట్‌ తాత్కాలికంగా మూతబడింది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌ నుంచి ముంబయికి వచ్చే విమానమే చివరిదని సంస్థ ప్రకటించింది. మరోవైపు గత కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు చెల్లించాలంటూ నిరసన చేస్తున్నారు.