ఆంధ్రప్రదేశ్

జులైలో పోలవరం నీరు: చంద్రబాబు

అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల అనంతరం పోలవరం పనులపై సమీక్షించడం ఇదే తొలిసారి కాగా.. ఇప్పటి వరకు ఇది 90వ సారి కావడం గమనార్హం.

ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్ట్‌ పురోగతిని సీఎంకు వివరించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 69 శాతం పూర్తయ్యిందని తెలిపారు. కాంక్రీట్‌ పనులు 72.40 శాతం పూర్తయ్యాయని చెప్పారు. 28.16 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు జరిగాయని వివరించారు. తవ్వకం పనులు 84.60శాతం పూర్తవ్వగా.. కుడి ప్రధాన కాల్వ పనులు 90.87 శాతం, ఎడమ ప్రధాన కాల్వ పనులు 70.38 శాతం పూర్తయ్యాయయని తెలిపారు. రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు 66.22 శాతం, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు 40.71 శాతం, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు 25.04 శాతం  పూర్తయ్యాయని సీఎంకు వివరించారు.