అంతర్జాతీయంవ్యాపారం

జుకర్‌బర్గ్‌ భద్రతకు ఎంత చెల్లిస్తున్నారో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ గత కొన్నేళ్లుగా ఏడాదికి కేవలం ఒకే డాలరు జీతం మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఆయన భద్రత కోసం ఫేస్‌బుక్‌ భారీగా వెచ్చిస్తోంది. జుకర్‌బర్గ్‌ భద్రత కోసం 2018లో ఫేస్‌బుక్‌ దాదాపు 20 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసిందట. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 138 కోట్లకు పైమాటే. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. కాగా.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం.

గత మూడేళ్లుగా జుకర్‌బర్గ్‌ మూలవేతనం అక్షరాలా 1 డాలరుగా ఉంది. అయితే ఇతర సదుపాయాల కింద గతేడాది 22.6మిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 90శాతం జుకర్‌, ఆయన కుటుంబం భద్రత కోసమే ఖర్చు చేసినట్లు పేర్కొంది. జుకర్‌ భద్రత కోసం 2018లో దాదాపు 20 మిలియన్‌ డాలర్లు వెచ్చించింది. మిగతా 2.6 మిలియన్‌ డాలర్లు జుకర్‌ వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేసింది. అయితే 2017తో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ.

కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు రావడంతో సోషల్‌మీడియా సంస్థలు తమ  సీఈవోల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్‌ భద్రత కోసం ఫేస్‌బుక్‌ భారీగా ఖర్చు చేస్తోంది. ఇక ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌బర్గ్‌ వేతనం మాత్రం కాస్త తగ్గింది. 2017లో ఆమె 25.2 మిలియన్‌ డాలర్ల జీతం అందుకోగా.. 2018లో అది 23.7మిలియన్‌  డాలర్లుగా ఉంది.