జాతీయం

జీవితాన్నే మార్చేసిన ట్రోఫీ అదే!

ముంబయి: విజయ్‌ శంకర్‌..రెండు మూడు సంవత్సరాల క్రితం ఇది అంతగా పరిచయం లేని పేరు. కానీ గతేడాది జరిగిన నిదహాస్‌ ట్రోఫీ నుంచి ఈ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ ట్రోఫీనే శంకర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ వైపు నడిపించింది. ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ అవకాశం తెచ్చిపెట్టింది. ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అంతగా ఆకట్టుకోని శంకర్‌..ప్రపంచకప్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా తన జీవితాన్నే మార్చేసిన సందర్భం ఏదని మీడియా ప్రశ్నించగా దీనిపై శంకర్‌ మాట్లాడుతూ..

‘క్రికెటర్‌గా నా జీవితాన్నే మలుపు తిప్పిన సమయం ఏదైనా ఉంటే అది నిదహాస్‌ ట్రోఫీనే. ఈ ట్రోఫీ జరిగి ఏడాది కావొస్తున్నా నాకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా 50కి పైగా ఫోన్‌ కాల్స్ వచ్చాయి. నిజమే..కష్టాల్లో ఎన్నో నేర్చుకుంటాం. అది క్రికెట్‌ అయినా.. జీవితమయినా. నాకు కూడా సిసలైన క్రికెట్‌ అంటే ఏమిటో నిదహాస్‌ ట్రోఫీ ద్వారానే తెలిసింది. ఇక టీమిండియా విషయానికొస్తే..నాకే సందేహం వచ్చినా, సలహా కావాలన్నా ధోనీ భాయ్‌నే అడుగుతాను. వివిధ సందర్భాల్లో ఒత్తిడిని ఎలా జయించాలో రోహిత్‌, కోహ్లీ నుంచి సలహాలు తీసుకుంటాను. ఈ ముగ్గురి వద్ద ఆట పరంగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది’ అని తెలిపాడు.