అంతర్జాతీయం

జీతం అడిగితే..మానవత్వం మరిచారు

నోయిడా: మానవత్వం, సాటి మనిషిని మనిషిగా చూడటం తెలీనట్లు ప్రవర్తించారు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన కొందరు మృగాళ్లు. జీతం అడిగిందని ఓ మహిళను వారు హింసించిన తీరు మన సమాజానికేమైందనే ప్రశ్న లేవనెత్తుతుంది. ఓ మహిళను అంతగా బాధిస్తున్నా ఇంకొందరు ప్రేక్షకుల్లా మిగిలిపోయారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. సామాజిక మాధ్యామాల్లో దర్శనమిచ్చిన ఓ వీడియో ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నోయిడాలోని నాలెడ్జ్‌ పార్క్‌ సమీపంలోని ఓ వ్యాపార సముదాయం వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బాధితురాలు నాలెడ్జ్‌ పార్క్‌ వద్ద ఓ సెలూన్‌లో పనిచేస్తుంది. అయితే ఈ నెల ఒకటికి ఆమెకు రావాల్సిన జీతం ఆలస్యమైంది. దాంతో ఆమె తన జీతం గురించి అడగడంతో ఆ షాపుకు చెందిన కొందరి వ్యక్తులతో వాగ్వాదం మొదలైంది.  అది కాస్తా ఆమె మీద దాడి చేసే స్థాయికి చేరింది. వారు బాధిరాలిని జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీదకు లాగి, కర్రతో దాడి చేశారు. కొందరు ఆ దారుణానికి అడ్డు తగిలినా, రోడ్డు పక్కన చాలామంది ప్రేక్షకుల్లా చోద్యం చూస్తూ, ఆ ఘటనను నిలువరించలేకపోయారు.
తీవ్రంగా గాయాలపాలైన ఆమె, వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని మీడియా కథనం. అనంతరం ట్విటర్ వేదికగా యూపీ పోలీసులు స్పందించారు. నాలెడ్జ్‌ పార్క్‌ సమీపంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు  చేశారని, దర్యాప్తు జరుగుతోందని దానిలో పేర్కొన్నారు.