జాతీయం

జయకు భారతరత్న.. ప్రధానికి సీఎం లేఖ

దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా కితాబు
చెన్నై (స్నేహ టీవీ ): తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  ఒక లేఖ రాశారు. దేశంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నేతల్లో జయలలిత ఒకరని లేఖలో ఎడప్పాడి తెలిపారు. ప్రజలకు అనిర్వచనీయమని సేవలందించి.. తమిళనాడు రాష్ట్రాభివృద్ధిలో ఆమె ఎంతో కీలకపాత్ర పోషించడమే కాక వ్యక్తిగత జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిందని లేఖలో ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. కాబట్టి భారతరత్న పురస్కారానికి జయలలిత పూర్తిగా అర్హురాలని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆమె ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమపథకాలకు దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగాను ప్రశంసలు దక్కాయని, పేద ప్రజలకు ఆమె నిజంగానే ‘అమ్మ’గా ప్రేమాభిమానాలు పంచారని అన్నారు.
    విద్యార్ధి దశలో చదువులోను, ఇతర బోధనాంశాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచారని, తరువాత సినీరంగంలో ప్రవేశించి నటిగా ఉన్నత స్థాయికి చేరుకున్నారని, పుస్తకపఠనంతో అపారమైన జ్ఞానాన్ని సంపాదించి, తరువాత రోజుల్లో రాజకీయరంగంలో తిరుగులేని నేతగా ఎదిగారని, తమిళనాడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారని గుర్తుచేశారు. రాష్ట్ర అంతర్గత రక్షణ, ఇతర కీలక అంశాల్లో ఆమె తీసుకున్న నిర్ణయాలు, చూపిన తెగువ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సైతం మెప్పించాయని లేఖలో ప్రస్తావించారు. భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన, చరిష్మా కలిగిన నేతల్లో జయ ముందువరుసలో ఉంటారని, రాజకీయచదరంగంలో అనేక క్లిష్టమైన పరిస్థితులను అధిగమించి ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని పేర్కొన్నారు.
    ఇక మహిళల సంక్షేమం, భద్రత, మహిళా సాధికారికత, బాలికల భద్రత, మాతాశిశుసంక్షేమం కోసం జయలలిత ప్రవేశపెట్టిన పథకాలు, అమలుచేసిన విధానాలు అమోఘమైనవని చెప్పారు. కులమతాలకతీతంగా రాజకీయాలను సాగించి సాంఘిక న్యాయం కోసం కృషి చేశారని, అందరికీ సమన్యాయం కోసం పాటుపడ్డారని, అన్ని రంగాల్లోను రాష్ట్రాన్ని ముందజంలో నడిపారని, తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు ‘అమ్మ’గా ఆరాధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని జయకు ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వాలని సిఫారసు చేస్తూ గత 9వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం కూడా చేశామని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రధాని వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎడప్పాడి కోరారు.