జాతీయం

జమ్ముకశ్మీర్‌ ప్రమాదం హృదయవిదారకం: మోదీ

జమ్ముకశ్మీరలోని కిష్టావర్‌ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ..‘‘జమ్ముకశ్మీర్‌లోని జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. మృతుల ఆత్మలకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ట్విటర్‌ వేదికగా మోదీ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఘటనపై స్పందించారు. ‘‘విషయం తెలియగానే తీవ్ర ఆవేదనకు గురయ్యాను. మృతుల కుటుంబాలను సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు ఆ రాష్ట్ర కీలక నేతలు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీ నేత ఒమర్‌ అబ్దుల్లా సైతం ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే క్షతగాత్రుల చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామన్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జమ్ముకశ్మీర్‌లోని కేశ్వాన్‌ నుంచి కిష్టావర్‌ వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 33 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంతో పాటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే బస్సు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.