ఆంధ్రప్రదేశ్

జగన్ సర్కార్‌పై పురందేశ్వరి….?

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయిందని ఆరోపించారు. టీడీపీ అవినీతిని గ్రహించిన ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా.. సీఎం జగన్ తరచూ హోదా గురించి మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. విభజన చట్టంలోని అంశాలను 90 శాతం కేంద్రం అమలు చేసిందని స్పష్టం చేశారు. ఇసుక పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందన్నారు. కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను తరలించే విషయంలో జగన్ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయంగా రామయపట్నాన్ని ప్రతిపాదించాలని తెలిపారు.