ఆంధ్రప్రదేశ్

‘జగన్‌ సాక్షిగా..’ అంటూ ఎమ్మెల్యే ప్రమాణం!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశమైన శాసనసభలో ఒక్కరు మినహా 173 మంది సభ్యులు ప్రమాణస్వీకారం పూర్తయింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ శంబంగి అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దైవసాక్షిగా అనడానికి బదులు జగన్‌ సాక్షిగా.. అంటూ ప్రమాణం చేయడంతో ఆయనతో ప్రొటెం స్పీకర్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేయించారు. నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సభకు హాజరు కాలేదు. స్పీకర్‌ ఎన్నిక రేపు జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తమ్మినేని సీతారాం అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు. ఉభయసభల్ని ఉద్దేశించి శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు.