ఆంధ్రప్రదేశ్

జగన్‌.. మిమ్మల్ని ఎలా నమ్మాలి?: శివాజీ

రాజమహేంద్రవరం: వైకాపా అధ్యక్షుడు జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకొనే రీతిలో వ్యవహరిస్తున్నారని సినీ నటుడు శివాజీ విమర్శించారు. ఏపీ ప్రయోజనాలను ఏమాత్రం సహించని కేసీఆర్‌ సాయంతో హోదా సాధిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మురళీమోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి ఆశిస్తున్న జగన్‌పై భవిష్యత్తులో కేసులు నిరూపణ అయితే పరిస్థితి ఏంటని శివాజీ ప్రశ్నించారు. అమరావతిపై జగన్‌ తన వైఖరిని ఎందుకు స్పష్టంచేయడం లేదని నిలదీశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్‌తో కలిసి జగన్‌ హోదా సాధిస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ఆస్తులతో పాటు పోలవరానికి అడ్డుపడబోనని, కృష్ణా జలాల్లో రాయలసీమ వాటాను హరించబోనంటూ కేసీఆర్‌తో రాతపూర్వకంగా తీసుకురావాలని జగన్‌కు సూచించారు.