ఆంధ్రప్రదేశ్

జగన్‌తో స్టీఫెన్‌ రవీంద్ర భేటీ!

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం జగన్‌తో పలువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌, ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు. జిల్లాలకు చెందిన కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు తాడేపల్లిలోని జగన్‌ నివాసంలో ఆయనను కలిసి వెళ్లారు. రాష్ట్రాభివృద్ధితో పాటు నూతన ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులను జగన్‌ కోరారు.

మరోవైపు హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర కూడా జగన్‌తో భేటీ అయ్యారు. ఏపీ ఇంటెలెజెన్స్‌ చీఫ్‌గా నియమితులు కానున్నారనే వార్తల నేపథ్యంలో స్టీఫెన్‌ రవీంద్ర సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించుకునే ముందు ఏపీ నుంచి అధికారిక సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కేడర్‌ మార్పుపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఈ అంశాలపైనే స్టీఫెన్‌ రవీంద్ర జగన్‌తో చర్చించినట్లు సమాచారం. జగన్‌ ప్రమాణస్వీకారం తర్వాత రవీంద్ర బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.