అంతర్జాతీయం

చూస్తుండగానే.. సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం…

(స్నేహ టీవీ) సిడ్నీ: పపువా న్యూ గినియాకి చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతూనే ఉన్నట్టుండి సముద్రంలోకి దూసుకెళ్లింది. అది సముద్రంలో మునగక ముందే సహాయక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. శుక్రవారం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీప దేశం మైక్రోనేసియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయంలో రన్‌వే చిన్నదిగా ఉండడం… ల్యాండ్ అవ్వడానికి స్థలం సరిపోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు చూక్ ఎయిర్‌పోర్టు జనరల్ మేనేజర్ జిమ్మీ ఎమిలియో వెల్లడించారు.
‘‘విమానం ఇక్కడ రన్‌వేపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే దిగేందుకు 150 గజాలు తక్కువ కావడంతో అది సముద్రంలోకి దూసుకెళ్లింది. తొలుత ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. హుటాహుటిన 36 మందిని బోట్ల ద్వారా కాపాడాం. 11 మంది విమాన సిబ్బంది కూడా క్షేమంగా బయటికి వచ్చారు. విమానం మాత్రం నీటిలో మునిగిపోతోంది..’’ అని ఆయన వెల్లడించారు. కాగా 13 ఏళ్ల ఈ బోయింగ్ 737-800 విమానాన్ని ఇంతకు ముందు జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు కూడా ఉపయోగించాయి.