క్రీడలు

చివరి టీ-20లోనూ భారత్ విజయం

భారత మహిళలు శ్రీలంక పర్యటనను ఘనంగా ముగించారు. లంక మహిళలతో జరిగిన ఐదు టీ-20 సిరీస్‌ను భారత మహిళలు 4-0తో సొంతంచేసుకున్నారు. మంగళవారం జరిగిన చివరి టీ-20లో భారత్‌ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 18.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. భరత ఓపెనర్లు మందాన(0), మిథాలీ(12) త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్‌ (46; 31 బంతుల్లో 6×4, 1×6), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (63; 38 బంతుల్లో 3×4, 5×6)ల జోడి జట్టును ఆదుకున్నారు. వీరి నిష్క్రమణ అనంతరం వచ్చిన వారు వచ్చినట్టు పెవిలియన్ చేరడంతో 156 పరుగులు చేసింది. సిరివర్ధనే, ప్రియదర్శిని తలో మూడు విసీజెట్లు తీశారు.

అనంతరం 157 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక మహిళలు 17.4 ఓవర్లలో 105 పరుగులు చేసి ఓడిపోయారు. భారత బౌలర్ల ధాటికి లంక ఓపెనర్లు మెండిస్ (10), ఆటపట్టు (0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అనంతరం సంజీవిని (29), సిరివర్ధనే (22), రామసింఘే (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. పూనమ్‌ యాదవ్‌ మూడు.. దీప్తి శర్మ, రాధ తలో రెండు వికెట్లు తీశారు. ఐదు టీ-20 సిరీస్‌లో నాలుగు మ్యాచ్ లను భారత మహిళలు గెలుచుకోగా.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.