అంతర్జాతీయం

చిన్నారుల మరణాల రేటు భారత్‌లోనే అధికం

వాషింగ్టన్‌ (అమెరికా):‌ చిన్నారుల మరణాల రేటు భారత్‌లోనే అధికంగా ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూంబర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు భారత్‌లోని 25 రాష్ట్రాల శిశు మరణాల నివేదికలను సేకరించి 2000 నుంచి 2015 మధ్య ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, అందుకు కారణమైన అంశాలపై పరిశోధన జరిపారు. ఈ కాలంలో చిన్నారుల మరణాల రేటును తగ్గించడంలో భారత్ మెరుగైన ఫలితాలను సాధించిందని, 2000 ఏడాదిలో 2.5 మిలియన్లుగా ఉన్న ఈ రేటు.. 2015 నాటికి 2.5 మిలియన్ల వరకు తగ్గిందని పేర్కొంది. అయినప్పటికీ, ఆ ఏడాది చిన్నారుల మరణాలు అత్యధికంగా ఉంటున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్‌ మొదటి స్థానంలో ఉంది.

ఐదేళ్లలోపు ఉన్న చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉంది. గోవాలో కన్నా ఆ రాష్ట్రంలో ఏడు రెట్లు ఈ రేటు అధికంగా ఉంది. తొమ్మిది నెలలు నిండకుండానే పుట్టడం వల్ల శిశువుల్లో తలెత్తున్న సమస్యలు, న్యూమోనియా, ఇన్ఫెక్షన్‌ వల్ల వచ్చే వ్యాధుల వల్ల చిన్నారుల మరణాలు అధికంగా తలెత్తుతున్నాయి. చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో వాక్సిన్‌ కవరేజ్‌, శిశువుల సంరక్షణపై శ్రద్ధను పెంచడం వల్ల మరణాల రేటును తగ్గించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. 2015లో చిన్నారుల మరణాల్లో.. నాలుగు నెలలలోపు ఉన్న పసిమొగ్గలే 57.9 శాతం మంది ఉన్నారని తెలిసింది.