జాతీయం

చమురు ట్యాంకర్లలో భారీ పేలుళ్లు

గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో రెండు చమురు ట్యాంకర్లలో భారీ పేలుళ్లు  సంభవించాయి. కోకుకా కార్గోస్‌కు చెందిన నౌక, ఫ్రంట్‌ ఆల్టర్‌కు చెందిన నౌకలు ప్రమాదాలకు గురైయ్యాయి. రెండు నౌకల్లో కలిపి మొత్తం 44 మందిని కాపాడారు.  యూఏఈకి చెందిన చమురు ట్యాంకరుపై దాడి జరిగిన నెలరోజుల తర్వాత ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. గురువారం జరిగిన ఘటనతో చమురు ధరలు 4.5శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ప్రమాదామా..? దాడి కావచ్చా..?
నార్వే ప్రభుత్వానికి చెందిన ఫ్రంట్‌ ఆల్టర్‌ నౌకపై దాడి జరిగిందనే వాదనలు వచ్చాయి. నౌకబోర్డులో మూడు పేలుళ్లు సంభవించాయని నార్వే మారీటైమ్‌ అథారిటీ పేర్కొంది. ఈ నౌక తైవాన్‌ సీపీసీ కార్ప్‌కు 75,000 టన్నుల నాఫ్తాను రవాణా చేస్తోంది. దీనిపై టార్పిడోతో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఇక పనామా జెండాతో వస్తున్న కోకుకా నౌక మిథనాల్‌ను తీసుకెళుతుండగా జరిగింది. వెంటనే సమీపంలో వెళుతున్న మరో నౌక సాయంతో సిబ్బందిని రక్షించారు. మిథనాల్‌ లోడ్‌ ఉండటంతో ఇది మునిగిపోయే ప్రమాదముంది. ఇరాన్‌కు 16 మైళ్ల దూరంలో.. యూఏఈలోని ఫుజైరాకు 80మైళ్ల దూరంలో ఈఘటన చోటు చేసుకొంది. వీరిని రక్షించి ఇరాన్‌లోని పోర్టు ఆఫ్‌ జస్క్‌కు తరలించినట్లు ఆ దేశ వార్తాసంస్థలు పేర్కొన్నాయి.

ఆ భేటీ తర్వాత ఇలా జరిగింది..
జపాన్‌ ప్రధాని షింజో అబే తమ సుప్రీం లీడర్‌ అయాతుల్లా ఖోమైనీతో భేటీ అయిన తర్వాతే ఈఘటన జరిగిందని ఇరాన్‌ విదేశీవ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించారు.