జాతీయం

చంద్రయాన్‌-2.. ఇస్రో స్పెషల్‌ వీడియో

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘చంద్రయాన్‌-2’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ నెల 15న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ప్రయోగానికి ఇంకా వారం రోజులు ఉందనగా ఇస్రో చంద్రయాన్‌-2కి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

ఇస్రో వీడియోను ట్విటర్‌లో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) షేర్‌ చేసింది. ‘‘మేం సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమేనా? రోవర్‌ ఆధారిత భారత తొలి స్పేస్‌ మిషన్‌ ‘చంద్రయాన్‌ 2’. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే ప్రపంచపు తొలి రోవర్‌ ఇది’’ అని పేర్కొంది.

చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టే భారత రెండో మూన్‌ మిషన్‌ అయిన చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌, రోవర్‌ను పంపనున్నారు. ప్రయోగం అనంతరం ఇది దాదాపు 16 రోజులు భూకక్ష్యలో తిరిగి అనంతరం చంద్రుడి దిశగా కదులుతుంది. అలా సెప్టెంబర్‌ 27న చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. అనంతరం అక్కడ ప్రయోగాలు చేపట్టనుంది.

మరోవైపు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో చంద్రయాన్‌-2 ప్రయోగ సందడి నెలకొంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు జీఎస్‌ఎల్‌వీ- మార్క్‌ 3 వాహక నౌకను రెండో ప్రయోగ వేదికకు తీసుకువచ్చారు. ప్రయోగ వేదికపైనే వారం రోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌-2 నింగిలోకి దూసుకెళ్లనుంది.