జాతీయం

చంద్రబాబు, మాయావతికి దీదీ కృతజ్ఞతలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు అండగా నిలిచిన ప్రతిపక్ష నేతలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మాకు, బెంగాల్‌ ప్రజలకు మద్దతుగా నిలిచిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌, ఇతర విపక్ష నేతలకు ధన్యవాదాలు. భాజపా ఆదేశాలతో ఈసీ పక్షపాత చర్యలకు పాల్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్లే. దీనికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’ అని మమతాబెనర్జీ ట్విట్‌ చేశారు.

పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని గురువారం రాత్రి 10 గంటలతో ముగించాలని ఈసీ నిన్న అసాధారణ ఆదేశాలను జారీ చేసింది. సాధారణంగా పోలింగ్‌ జరగడానికి రెండు రోజుల ముందు ప్రచారం ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికల ఏడో విడత పోలింగ్‌ ఆదివారం జరగనుంది. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియాల్సి ఉండగా.. ఆందోళనల దృష్ట్యా ఒక రోజు తగ్గించారు.

అయితే దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సంఘం పనిచేస్తోందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి దుయ్యబట్టగా.. ఈసీ తన స్వతంత్రతను కోల్పోయిందని కాంగ్రెస్‌ ఆరోపించింది.