ఆంధ్రప్రదేశ్

‘చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే’

విజయవాడ: తెదేపా అధినేత, సీఎం చంద్రబాబుది కుటుంబపాలన అని ప్రముఖ సినీనటుడు, వైకాపా నేత మోహన్‌బాబు ఆరోపించారు. చంద్రబాబు గురించి చెప్పడానికి 365 రోజులూ సరిపోవని వ్యాఖ్యానించారు. విజయవాడ వైకాపా కార్యాలయంలో మోహన్‌బాబు మాట్లాడుతూ.. తెదేపా అధినేతపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో ఆయన తనయుడు హరికృష్ణ వేల కిలోమీటర్లు తిరిగారని.. ఆ కుటుంబానికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ రాష్ట్రానికి వస్తే బేడీలు వేస్తానని గతంలో ఆయన చెప్పిన విషయాన్ని మోహన్‌బాబు గుర్తు చేశారు. ఆ తర్వాత మోదీతో చంద్రబాబు చేతులు కలిపారని.. ఇప్పుడు ఆయన్ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెదేపా అని.. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్‌తో వెళ్తున్నారన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో కార్యకర్తలు ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పారు.