క్రైమ్

ఘోర ప్రమాదం:ఒకేకుటుంబంలో ఐదుగురి మృతి

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఎస్సై మల్లేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వైపు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం లారీని ఢీకొట్టింది. శ్రీశైలం – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గ్రానైట్‌ లోడుతో వెళ్తున్న లారీ వే బ్రిడ్జి వద్ద క్రాసింగ్‌ అవుతున్న సమయంలో కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన కుమారుడు శాంతన్‌, సోదరి పద్మజ, బావ రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య విజయలక్ష్మి, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే విజయలక్ష్మి ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది.