తెలంగాణ

గెలుపోటములు సహజం: తలసాని

రాజకీయ క్షేత్రంలో గెలుపోటములు సహజమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, తెరాస ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఓటమికి అధైర్య పడకుండా ప్రజాతీర్పును గౌరవించాలన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని..సికింద్రాబాద్‌ పరిధిలోని డివిజన్లు, బస్తీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో దేశం గర్వించేలా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం అమలు చేసిందని తలసాని వివరించారు. ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్‌ స్థానం నుంచి భాజపా అభ్యర్థి కిషన్‌ రెడ్డి విజయం సాధించారు. తెరాస అభ్యర్థి సాయికిరణ్‌పై 51వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు.