జాతీయం

గూగుల్‌ ప్రకటనల్లో ఎక్కువ ఖర్చు ఏ పార్టీదంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు, నేతలు బిజీబిజీగా ఉన్నారు. వీటితో ఆగకుండా సోషల్‌మీడియా, ఇంటర్నెట్‌లోనూ ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు గూగుల్‌లోనూ రాజకీయ ప్రకటనలు ఇస్తున్నారు. ఇందు కోసం ఆయా పార్టీలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి.

తమ వేదికపై రాజకీయ ప్రకటనలు, వాటికి పార్టీలు చేసిన ఖర్చుపై గూగుల్‌ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌ రూపొందించింది. ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు రాజకీయ ప్రకటనల కోసం పార్టీలు చేసిన ఖర్చు వివరాలను ఇందులో పేర్కొంది. ఫిబ్రవరి 19 నుంచి భారతీయ జనతా పార్టీ 554 ప్రకటనలు గూగుల్‌లో పోస్టు చేయగా.. వీటి కోసం రూ. 1.21కోట్లు ఖర్చు చేసింది. భాజపా తర్వాత వైకాపా 107 ప్రకటనల కోసం రూ. 1.04కోట్లు వెచ్చించింది.

ఇదిలా ఉండగా.. తెలుగుదేశం పార్టీ కోసం రెండు గ్రూప్‌లు గూగుల్‌లో ప్రకటనలు పోస్టు చేశాయి. తెదేపా ప్రకటనల కోసం ప్రమణ్య స్ట్రాటజీ కన్సల్టింగ్‌ ప్రయివేటు లిమిటెడ్ రూ. 85.25లక్షలు, డిజిటాంట్‌ కన్సల్టింగ్‌ ప్రయివేటు లిమిటెడ్‌ రూ. 63.43లక్షలు ఖర్చు పెట్టింది. ఈ రెండు కంపెనీలు పెట్టిన మొత్తం ఖర్చు రూ. 1.48కోట్లుగా ఉంది. అంటే భాజపా, వైకాపా కంటే తెదేపా ప్రకటనలకే ఎక్కువ మొత్తం ఖర్చయ్యింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ గూగుల్‌ ప్రకటనల కోసం కేవలం రూ.54,100 మాత్రమే ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది.

ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు గూగుల్‌ ప్లాట్‌ఫామ్‌పై 831 రాజకీయ ప్రకటనలు రాగా.. వాటి మొత్తం ఖర్చు విలువ రూ. 3.76కోట్లుగా ఉంది.  అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రూప్‌లు రూ. 1.73కోట్లు ఖర్చు చేశాయి. తెలంగాణ నుంచి రూ.72లక్షలు వెచ్చించారు.