జాతీయం

గాయంతోనే ఎన్నికల ప్రచారానికి శశిథరూర్‌

తిరువనంతపురం: తులాభారం మొక్కు తీర్చుకుంటుండగా గాయపడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఆ మరుసటి రోజే ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన రాహుల్‌ ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారానికి వచ్చిన శశిథరూర్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రశంసించారు. ‘థరూర్‌కు గాయమైందని తెలిసి ఆందోళనకు గురయ్యా. కానీ ఆయన మళ్లీ ప్రచారానికి రావడం ఆనందంగా ఉంది. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనం. శశిథరూర్‌ కేరళకు గొప్ప ఆస్తి. మీ కోసం ఆయన కష్టపడి పనిచేస్తారు. పార్లమెంట్‌లో మీ కోసం మాట్లాడతారు’ అని రాహుల్‌ కొనియాడారు.

కేరళ నూతన సంవత్సరాది విషును పురస్కరించుకుని శశిథరూర్‌ సోమవారం స్థానిక ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం తులాభారం మొక్కు తీర్చుకుంటుండగా త్రాసు తెగడంతో ఆయన గాయపడ్డారు. త్రాసుపైన ఉండే బరువైన ఇనుప కడ్డీ ఆయన మీద పడటంతో తల, కాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన శశిథరూర్‌ నేరుగా ప్రచారానికి వచ్చారు.

తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన శశిథరూర్‌.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు.  ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌తో ఆయన పోటీపడనున్నారు. కేరళలో ఏప్రిల్‌ 23న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.