క్రీడలు

గంభీర్‌కు వ్యక్తిత్వమే లేదు : అఫ్రిది

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిది అఫ్రిది ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాను రాసుకుంటున్న ఆత్మకథ ‘గేమ్‌ ఛేంజర్‌’లో తన వయసు గురించి నిజాలు బయటపెట్టిన దాయాదీ మాజీ ఆల్‌రౌండర్‌ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈసారి గంభీర్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. తనకు, గంభీర్‌కు మధ్య జరిగిన గొడవలు, గంభీర్‌ వ్యక్తిత్వం గురించి ప్రస్తావించాడు.
‘కొంత మంది వ్యక్తిగతంగా ప్రత్యర్థులు.. మరి కొంత మంది ఆటపరంగా ప్రత్యర్థులు. అందులో గంభీర్‌ మొదటి రకం. అతని వ్యక్తిత్వమే అతని సమస్య. అసలు అతనికి వ్యక్తిత్వమే లేదు. క్రికెట్‌ అనే పెద్ద ప్రపంచంలో అతను ఒక పాత్ర మాత్రమే. కానీ గంభీర్‌ మాత్రం డాన్‌ బ్రాడ్‌మన్‌, జేమ్స్‌బాండ్‌ లక్షణాలు కలిపి తనలోనే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాడు. చెప్పుకోదగ్గ ఒక్క రికార్డు కూడా గంభీర్‌కు లేదు. కేవలం అతని ప్రవర్తనతోనే అందరి నోళ్లలో నానుతుంటాడు’ అని అఫ్రిది నోరుపారేసుకున్నాడు.
2007లో ఆసియాకప్‌ సందర్భంగా గంభీర్‌, అఫ్రిది మధ్య జరిగిన సంఘటన క్రికెట్‌ అభిమానులందరికి ఇప్పటికీ గుర్తుంది. అయితే, అఫ్రిది ఆ సంఘటన గురించి కూడా తన పుస్తకంలో ప్రస్తావించాడు. ‘ఆసియాకప్‌ సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న గంభీర్‌ ఒక పరుగు పూర్తి చేసి రెండో రన్‌ కోసం పరుగెత్తుతున్న సమయంలో నేరుగా నా ఎదురుగా వచ్చాడు. అప్పుడు ఇద్దరం అసభ్య పదజాలంతో తిట్టుకున్నాం. ఆ విషయాన్ని నేనిప్పటికీ మర్చిపోలేదు. కరాచీలో గంభీర్‌ను తాము ‘సర్యల్‌’(మాడిపోతున్న వాడు) అని పిలుస్తుంటాం. క్రికెటర్లకు పోటీతత్వంతో పాటు కొంచెం దూకుడు కూడా ఉండొచ్చు. వాటితో పాటు కొంచెం సానుకూల దృక్పథం కూడా ఉండాలి. కానీ, గంభీర్‌లో అవి లేవు’ అని అఫ్రిది రాసుకొచ్చాడు. కొంతకాలం క్రితం భారత జట్టు మానసిక నిపుణుడిగా పనిచేసిన పాడీ అప్టాన్‌ సైతం తన పుస్తకంలో గంభీర్‌ గురించి రాసుకొచ్చాడు. అందులో ‘అభద్రతాభావంతో ఆడే ఎడమచేతి బ్యాట్స్‌మన్‌’ అంటూ గంభీర్‌ను పేర్కొన్నాడు.