జాతీయం

కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయిన ప్రకాశ్‌రాజ్‌

బెంగళూర్‌ సెంట్రల్‌ నుంచి పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. తన ప్రత్యర్థి భాజపా అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తుండడంతో ఓటమి తప్పదని భావించిన ఆయన తన మద్దతుదారులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున రిజ్వాన్‌ అర్షద్‌, భాజపా నుంచి సిట్టింగ్‌ ఎంపీ పీసీ మోహన్‌ బరిలోకి దిగారు. ఎన్నో ఏళ్లుగా భాజపా కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ప్రస్తుతం మోహన్‌ 4.9లక్షల ఓట్లతో ముందంజలో ఉండగా.. అర్షద్‌ 4.7లక్షల ఓట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. మోహన్‌ కంటే ప్రకాశ్‌ దాదాపు 24 వేల ఓట్లు వెనుకంజలో ఉన్నట్లు సమాచారం.

ఎగ్జిట్‌ ఫలితాలు కూడా అధికార భాజపాకే అనుకూలంగా రావడం గమనార్హం. అయితే ప్రకాశ్‌రాజ్‌ వాటిని తిప్పికొట్టిన విషయం తెలిసిందే. మే 23న రానున్న ఫలితాలతో ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని ప్రజలు నిరూపించబోతున్నారని వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా మోదీ విధానాలపై ప్రకాశ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.