క్రీడలు

కోహ్లీ..నువ్వు ఆర్సీబీకి మాత్రమే కెప్టెన్‌గా ఉండు..

కోల్‌కతా : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ‘నువ్వు ఆర్సీబీకి మాత్రమే కెప్టెన్‌గా ఉండు.. భారత జట్టుకు కాదు’ అని ముందే కోహ్లీకి సూచించానని గంభీర్‌ అన్నాడు. ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉండటం నిజంగా కోహ్లీ అదృష్టమని పేర్కొన్నాడు. కోహ్లీ ఉత్తమ ఆటగాడు, ప్రపంచంలోనే అతడ్ని మించిన బ్యాట్స్‌మెన్‌ లేరు. ఆ విషయంలో నేనూ ఏకీభవిస్తా.. కానీ కెప్టెన్సీలో మాత్రం కోహ్లీ మరింత నేర్చుకోవాలని అన్నాడు. ఏడు సంవత్సరాలు పాటు ఒకే జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఒక్కసారి కూడా కప్పు తేలేదని గుర్తు చేశాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఆరు వరుస ఓటములు గురించి మాట్లాడుతూ.. ‘ఆ ఓటములు నన్నెంతో బాధించాయి. ఏడేళ్ల పాటు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాణం పెట్టి ఆడాను. జట్టుకు ఆ పేరు తీసుకొచ్చేందుకు రక్తం దార పోశాను. మనస్ఫూర్తిగా కష్టపడ్డాం.. అందుకే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలవడంతో పాటు మూడు సార్లు ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోగలిగాం’ అని గౌతీ అన్నాడు. తూర్పు దిల్లీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌతం కోల్‌కతా జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోల్‌కతాకు ఇది ఒక్క చేదు సీజన్‌ అని పేర్కొన్నాడు. ఏదైతేనేం.. కేకేఈఆర్‌కు ఆల్‌ ది బెస్ట్‌.. కోల్‌కతాను ఎప్పుడూ అగ్రస్థానంలోనే చూడాలని కోరుకుంటా అని పేర్కొన్నాడు. ఈ భారత మాజీ క్రికెటర్‌ 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత దిల్లీ డేర్‌డెవిల్స్‌కు మారడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, ఫామ్‌లేమితో పాటు జట్టు వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో సీజన్‌ మధ్యలోనే గౌతీ వైదొలిగాడు.