జాతీయం

కోహ్లీ ఎక్కడా ఆందోళన చెందలేదు

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని మెచ్చుకున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడిలో ఏమాత్రం ఆందోళన కనిపించలేదని అన్నాడు. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి తక్కువ పరుగులకే పరిమితమైనా ఛేదనలో అఫ్గాన్‌.. టీమిండియాని భయపెట్టినంత పనిచేసింది. అఫ్గాన్‌.. ఆఖరి ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

‘ఈ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లీ సారథ్యం బాగుంది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. మ్యాచ్‌ మొత్తం అతడిలో ఏమాత్రం భయం కనపడలేదు. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో డాట్‌ బాల్స్‌ పడే కొద్ది ఆ జట్టు మెల్లిగా ఓటమివైపు పయనిస్తుందని అతనికి అర్థమైంది. ఈ మ్యాచ్‌ ద్వారా నాకు 2003 ప్రపంచకప్‌లో హాలెండ్‌తో జరిగిన మ్యాచ్‌ గుర్తుకువచ్చింది. అప్పుడు భారత జట్టు తక్కువ పరుగులకే పరిమితమైనా.. బౌలింగ్‌తో గెలుపొందాం’ అని సచిన్‌ వివరించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడిన ధోనీ(28), కేదార్‌ జాదవ్‌(52) లను విమర్శించిన సచిన్‌.. విరాట్‌కోహ్లీ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అతని ఫుట్‌వర్క్‌, బాడీ లాంగ్వేజ్‌లో చాలా ప్రత్యేకంగా కనిపించిందని.. అది తాను గమనించానని క్రికెట్‌ లెజెండ్‌ పేర్కొన్నాడు.