ఆంధ్రప్రదేశ్

కోడెలపై దాడి ఘటనలో 8మంది అరెస్టు

రాజుపాలెం (గుంటూరు): గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనుమట్ల గ్రామంలో పోలింగ్‌ రోజున ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడిలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆ గ్రామానికి  భారీగా పోలీసులు చేరుకున్నారు. సీసీ ఫుటేజ్‌లు, వీడియోలను పరిశీలించి.. 8 మందిని అదుపులోకి తీసుకోగా.. మొత్తం 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో మహిళలలు కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి రాజుపాలెంలో ఉండి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడిలో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.