జాతీయం

కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లు వచ్చేశాయ్‌!

హైదరాబాద్‌: కార్మికుల దినోత్సవం నాడు.. దక్షిణమధ్య రైల్వే నగర ప్రయాణికులకు కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. తక్కువ టిక్కెట్‌ ధరతో.. ఎక్కువ దూరం తీసుకెళ్లే ఎంఎంటీఎస్‌ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. నగర ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లకు బోగీలను పెంచే పని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం 9 బోగీలతో తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లు దశలవారీగా 12 బోగీలతో తిరిగేవిగా మారనున్నాయి. కొత్తగా 12 ఎంఎంటీఎస్‌ రైళ్లను సమకూర్చుకుంటున్న ద.మ. రైల్వే ఇప్పటికే 4 ఎంఎంటీఎస్‌ కొత్త రైళ్లను సిద్ధం చేసింది. ఆ నాలుగింటిలో రెండు ఎంఎంటీఎస్‌ రైళ్లు మే 1న నగర ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. దశలవారీగా మొత్తం అన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లకు 12 బోగీలుండేలా చర్యలు తీసుకుంటున్నామన ద.మ. రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్‌.రాకేష్‌ తెలిపారు.

ప్రయాణికుల అవసరాల మేరకు..
నగరంలో మెట్రో ప్రారంభమైనా ఎంఎంటీఎస్‌కు ఆదరణ తగ్గలేదు. ప్రతిరోజు 1.70 లక్షలకుపైగా ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంఎంటీఎస్‌ రైళ్లు సరిపడా తిరగక.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరగలేదుకాని.. వీటి సంఖ్య, సేవలు విస్తరిస్తే.. ప్రయాణికులకు కొదవలేదని ద.మ. రైల్వే సర్వేలో వెల్లడవ్వడంతో ఎంఎంటీఎస్‌ రైళ్లను పెంచడంపై ద.మ. రైల్వే దృష్టి పెట్టింది. టిక్కెట్‌ ధర తక్కువ ఉండడంతో ఎంఎంటీఎస్‌ రైళ్లలోనే ప్రయాణాలు సాగించేందుకు ఎక్కువ మంది ప్రయాణికులు మక్కువ చూపుతున్నారనేది కూడా వెల్లడైంది. అయితే సమయపాలన పాటించాలని, బోగీల సంఖ్యను పెంచాలని.. రైళ్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రయాణికులు కోరారు. సికింద్రాబాద్‌ – నాంపల్లి, సికింద్రాబాద్‌ – ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌ – లింగంపల్లి, ఫలక్‌నుమా – లింగంపల్లి మార్గాల్లో ప్రస్తుతం 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రతిరోజూ తిరుగుతున్నాయి.

రైల్వే అధికారులతో జీఎం సమీక్ష..
ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఎంఎంటీఎస్‌ రైళ్ల సేవలపై ద.మ. రైల్వే జీఎం గజానన్‌ మాల్య రైల్వే అధికారులతో మంగళవారం సమీక్షించారు. బుధవారం నుంచి 12 బోగీలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్న వేళ.. ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకోవాలని జీఎం గజానన్‌ మాల్య సూచించారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి.. సమయ పాలనపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా ఇవే లైన్లపై పంపించాల్సి ఉన్నందున.. సమన్వయంతో రైళ్ల సమయపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. అదనపు జనరల్‌ మేనేజర్‌ జాన్‌ థామస్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కె.వి.శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో..
ద.మ. రైల్వే కొత్తగా సమకూర్చుకుంటున్న కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలతోపాటు భద్రతకు పెద్దపీట వేస్తోంది. మొత్తం 12 రైళ్లలో 4 రైళ్లను సిద్ధం చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎక్కువమంది ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. అలాగే భద్రతకు పెద్దపీట వేస్తున్నారు.
• ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లలో 9 బోగీలున్నాయి. ఇందులో 700 మంది కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంది. 2 వేల మంది నిల్చుని.. మొత్తం 2700 మంది మాత్రమే ప్రయాణించగలరు. కొత్తగా వస్తున్న ఎంఎంటీఎస్‌ రైళ్ల బోగీలు 12కు పెరిగాయి. కూర్చునేవారి సంఖ్య 1150కి పెరగనుంది. నిల్చునేవారి సంఖ్య 4 వేల మంది. మొత్తమ్మీద ఒకేసారి 5150 మంది ప్రయాణించవచ్చు.
• మహిళా ప్రయాణికులకు కేటాయించిన బోగీల్లో సీసీటీవీ కెమేరాలున్నాయి.
• ఎల్‌ఈడీ విద్యుత్‌ కాంతులతో స్టేషన్ల వివరాలు, ప్రయాణికులకు సూచనలుంటాయి.
• విశాలమైన ప్రవేశ ద్వారాలుంటాయి.
• పైనుంచి సహజసిద్ధంగా వెలుతురుండేలా తీర్చిదిద్దారు.
• ఆకట్టుకునే రంగులతో కొత్త రైళ్లను తీర్చిదిద్దారు.
• సౌకర్యవంతంగా కూర్చునేలా రూపొందించారు.
• అత్యాధునిక సాంకేతికతతో బ్రేకింగ్‌ విధానం, ఇంజిన్లు పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.