తెలంగాణ

కొడంగల్ లో నామినేషన్ ర్యాలీకి అనుమతి నిరాకరణ… రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. కొడంగల్ లో ఈ రోజు నామినేషన్ దాఖలుకు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. నామినేషన్ ర్యాలీలు చేపట్టరాదని స్పష్టమైన ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి ఈ రోజు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించనున్నారు.

ఈ నేపథ్యంలో రేవంత్ నామినేషన్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు.. కొడంగల్ లో 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసులను మోహరించారు. అయితే అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నామినేషన్ ర్యాలీ తీసితీరుతామని రేవంత్ రెడ్డి వర్గీయులు స్పష్టం చేశారు. తమను వేధించడంలో భాగంగానే అధికార పార్టీ  పోలీసులను ఆయుధంగా వాడుతోందని ఆరోపించారు. ఇలాంటి ప్రతీకార రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని హితవు పలికారు.