తెలంగాణ

‘కేసీఆర్‌ను పుట్టలోంచి ఎలారప్పించాలో తెలుసు’

తెలంగాణలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెరాసలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ తాను చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరి మద్దతు కావాలన్నారు. తాను చేపట్టిన ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని.. తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. కేసీఆర్‌ పుట్టలో దాక్కొని ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనను పుట్టలోంచి ఎలా బయటకు రప్పించాలో తమకు తెలుసన్నారు. ప్రగతిభవన్‌లో ఎమ్మెల్యేలతో భేరసారాలు నడిపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.  రాజకీయ మాఫియాను ఆపకపోతే ప్రజల ఓటుకు విలువ పోతుందన్నారు. భవిష్యత్తులో డబ్బు ఉన్నవాళ్లంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీఎంలు అవుతారని విమర్శించారు. వివిధ వర్గాల మేధావులతో ఫిరాయింపులపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.