తెలంగాణ

‘కేజీ ’ చదివింపు కష్టమే!

హైదరాబాద్‌: ప్రముఖ పేరున్న కళాశాలలో ఇంజినీరింగ్‌ చేస్తున్న విద్యార్థికి ఏడాదికి అవుతున్న మొత్తం ఖర్చు కంటే ప్రాథమిక విద్యకు అయ్యే ఫీజుల భారమే ఎక్కువగా ఉంటోంది.. పిల్లాడికి పట్టుమని మూడేళ్లు నిండకుండానే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఒకటో తరగతి కంటే ముందే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల పేరుతో విద్యార్థులను విద్యాసంస్థలు చేర్చుకుంటున్నాయి. గ్రేటర్‌లోని కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కో పాఠశాల ఒక్కో ధరను ఇష్టానుసారం నిర్ణయించేసుకుంటున్నాయి. పుస్తకాలు, దుస్తులు, రవాణాల పేరుతో అదనపు భారం వేస్తున్నాయి. ఇవన్నీ ఆ పాఠశాల నిర్దేశించిన వారి వద్దే కొనుగోలు చేయాలనే నిబంధన అమలుచేస్తున్నాయి. విద్యార్థులను చేర్పించుకునే సందర్భంలో ప్రవేశ రుసుం తప్పనిసరి అంటూ యథేచ్ఛగా వసూలు చేస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ప్రవేశ ఫీజు రూ.15వేల నుంచి రూ.25వేల వరకు తీసుకుంటున్నాయి. అడ్మిషన్‌ ఫీజు వసూలు చేయకూడదనే విద్యాశాఖ నిబంధనకు గ్రేటర్‌లోని చాలా విద్యాసంస్థలు నీళ్లొదిలాయి. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ విద్య వరకు ఏ విద్యాసంవత్సరం చదువుతున్న విద్యార్థికైనా కొన్ని విద్యాసంస్థల్లో ఫీజు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఉంటోంది. పేరున్న ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజులతో ప్రాథమిక పాఠశాలల ఫీజులను పోల్చితే రెట్టింపు ఉంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

ముందస్తు వసూళ్లు..
విద్యాసంవత్సరం ప్రారంభానికి మొదట్లోనే ఏడాది మొత్తం ఫీజును కొన్ని విద్యాసంస్థలు ముందస్తుగా వసూలు చేస్తున్నాయి. ఇలా చెల్లించే విద్యార్థి మొత్తం ఫీజులో 20శాతం నుంచి 30శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. జూన్‌  ఒకటినుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకుంటుంటే.. ఫీజులు మాత్రం మే 20వ తేదీ నుంచి 25వ తేదీలోపు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. వార్షిక స్పెషల్‌ ఫీజు, అడ్మిషన్‌ ఫీజు, స్టేషనరీ, దుస్తులు, పుస్తకాలు, రవాణా, ట్యూషన్‌ ఫీజుల పేరుతో ఒక్కోదానికి ఒక్కో మొత్తంను గ్రేటర్‌లోని కొన్ని విద్యాసంస్థలు నిర్ణయిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను చాలా విద్యాసంస్థలు పక్కన పెట్టేశాయి. సొంత పుస్తకాలను తయారు చేయించుకొని వాటినే తప్పకుండా కొనుక్కోవాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. వీటి ధరలు రూ.వేలల్లో ఉంటున్నాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉండి గత ఏడాదిలో అదే పాఠశాలలో కొన్న పుస్తకాలు ఉన్నాయని చెప్పినా.. అవి పనికిరావంటూ కొత్తవి కొనుగోలు చేయిస్తున్నారని కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అజమాయిషీ కరవు..
గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పలు కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ అధికారుల అజమాయిషీ కొరవడుతోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. విద్యాసంస్థ ఏర్పాటు నుంచి నిర్వహణ వరకు చాలా అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను చాలా విద్యాసంస్థలు పట్టించుకోకపోవడం గమనార్హం. వీటిపై కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో మిగతా విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వివరిస్తున్నారు. క్రీడా ప్రాంగణం, విశాలమైన తరగతులు, విద్యార్హతలు ఉన్న ఉపాధ్యాయుల భర్తీ, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు మరుగుదొడ్లు, మూత్రశాలల ఏర్పాటు చేయాలనే నిబంధనను చాలా విద్యాసంస్థలు అమలు చేయట్లేదనే ఆరోపణలున్నాయి. డిజిటల్‌ తరగతి గదులు, ఏసీ ప్రాంగణాల పేరుతో ఫీజులు భారీస్థాయిలో వసూలుచేయడంపై కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భారీగా నిర్ణయించిన ఫీజులను సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుము కలిపి వసూలు చేస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్డుఅదుపులేకుండా వసూళ్లు చేస్తున్న ఫీజులపైనా విద్యాశాఖ నియంత్రణ ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత ఫీజులు వసూళ్లు చేస్తున్న చాలా విద్యాసంస్థల్లోనూ కనీస వసతులు, క్రీడా మైదానాలు ఉండట్లేదని వారు వివరిస్తున్నారు.