జాతీయం

కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఈసీ పనిచేస్తోంది మాయావతి ధ్వజం

లఖ్‌నవూ: పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయాన్ని ఈసీ కుదించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సంఘం పనిచేస్తోందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. నేడు లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడిన ఆమె భాజపా ప్రభుత్వం, ఈసీపై విమర్శలు చేశారు.

‘మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. అందుకు మమతాబెనర్జీని లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గే ఈసీ బెంగాల్‌లో ప్రచార సమయాన్ని తగ్గించింది. ఈ రోజు బెంగాల్‌లో ప్రధాని రెండు ర్యాలీల్లో పాల్గొననున్నారు. అందుకే ఈసీ గురువారం రాత్రి 10 గంటలకు ప్రచారాన్ని ముగించాలని ఆదేశించింది. నిజంగానే ప్రచారాన్ని నిలిపివేయాలంటే ఈ రోజు ఉదయం నుంచే నిలిపివేసే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలు పారదర్శకంగా జరగట్లేదని దీని ద్వారా స్పష్టమవుతోంది’ మాయావతి దుయ్యబట్టారు.

. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కోల్‌కతాలో నిర్వహించిన ప్రదర్శనలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల దృష్ట్యా ప్రచారాన్ని ఒక రోజు ముందుగా గురువారమే ముగించాలంటూ ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయాన్ని తీసుకొంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.