క్రైమ్

కిడ్నీ రాకెట్‌ కేసులో 13 మంది అరెస్టు

టర్కీ, యూఏఈతోపాటు మధ్యప్రాచ్య దేశాలకు చెందిన వారికి అక్రమంగా కిడ్నీలు విక్రయిస్తున్న కేసులో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు సర్జన్లు, యూరాలజిస్ట్‌లే కావడం గమనార్హం. వీరందినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అరెస్టయిన వారిలో పుష్పవతి సింఘానియా రెసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(పీఎస్‌ఆర్‌ఐ) సీఈవో కూడా ఉన్నారు.

మానవ అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ ఫోర్టైజ్‌ ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు కాన్పూర్‌ సీనియర్‌ ఎస్పీ అనంత్‌ డియో వెల్లడించారు. అంతేకాకుండా దిల్లీలోని మరో ఆస్పత్రిలో పేద రోగులను మోసగించి వారి అవయవాలను విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని దీనిపై విచారణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. అనంత్‌ డియో తెలిపిన వివరాల ప్రకారం… కేతన్‌ కౌశిక్‌ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఆయన కోసం గాలిస్తున్నామని,  అవయవమార్పిడి అవసరమైన రోగులను టర్కీ, యూఏఈ, మధ్యప్రాచ్య  దేశాలనుంచి ఆయనే దిల్లీకి రప్పిస్తుంటాడని ఎస్పీ తెలిపారు. దాదాపు 12 మంది వ్యక్తుల నుంచి కిడ్నీలు తొలగించి, వారికి అధికమొత్తంలో నగదు ఇచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. కిడ్నీ దాతలకు కేవలం రూ.2 నుంచి రూ. 3 లక్షలు మాత్రమే ముట్టజెప్పి అవతలి వారి నుంచి దాదాపు రూ.70 నుంచి రూ.80 లక్షలు వసూలు చేస్తున్నారని అనంత్‌ డియో మీడియాకు తెలిపారు.