క్రీడలు

కింగ్స్‌కు వరుణ్‌ దీర్ఘకాల పెట్టుబడి: ప్రీతి జింతా

దిల్లీ: ఐపీఎల్‌-19 వేలంలో రూ.8.40 కోట్లతో కొనుగోలు చేసిన తమిళనాడు క్రికెటర్‌ వరుణ్‌ చక్రవర్తి తమ జట్టుకు ‘దీర్ఘ కాల పెట్టుబడి’ లాంటి వాడని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింతా అన్నారు. సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌కు బ్యాకప్‌ స్పిన్నర్‌గా ఉంటాడన్నారు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో వరుణ్‌ ప్రతిభ కనబరిచాడు. మిస్టరీ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

‘వరుణ్‌ అందరికీ తెలియని మిస్టరీ స్పిన్నర్‌. బ్యాకప్‌ స్పిన్నర్‌గా జట్టుకు విలువ తీసుకొస్తాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బయటపడని ప్రతిభకు కచ్చితంగా అవకాశాలు ఇస్తుంది. వరుణ్‌ మాకు దీర్ఘ కాల పెట్టుబడి. కోచ్‌ మైక్‌ హెసన్‌ మార్గదర్శనంలో సామర్థ్యాలను మెరుగు పరుచుకొని జట్టు విజయానికి తోడ్పడగలడు. 2019 వేలంలో మేం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నాం. పటిష్ఠ జట్టును నిర్మించేందుకు అవసరమైన ఆటగాళ్లను ఎంచుకున్నాం. ఇప్పుడు మాకు సమతూకమైన జట్టుంది. అవసరాలకు తగినట్టు ఆటగాళ్లు ఉన్నారు’ అని ప్రీతి జింతా అన్నారు.

ఇంకా రంజీల్లో అరంగేట్రం చేయని పంజాబ్‌ ఆటగాడు ప్రభు సిమ్రన్‌ సింగ్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసింది. అనుభవం లేకున్నా ప్రతిభ ఉంటే తాము ప్రోత్సహిస్తామని జింతా తెలిపారు. ఏ ఆటగాడినైనా కొనేముందు కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు యాజమాన్యం ఎంతో పరిశోధన చేస్తుందని వెల్లడించారు. స్థానిక కుర్రాడైన ప్రభు ప్రతిభ భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ప్రీతి జింతా ధీమా వ్యక్తం చేశారు.