జాతీయం

కాసేపట్లో సీఈసీతో విపక్ష నేతల భేటీ!

దిల్లీ: ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్‌ల వ్యవహారానికి సంబంధించి తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం 5గంటలకు వారంతా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోడాతో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయిన వెంటనే కలవాలని ప్రయత్నించినప్పటికీ.. సునీల్ అరోడా అందుబాటులో లేకపోవడంతో ఆయనతో సాయంత్రం భేటీ కానున్నారు. 50శాతం వీవీప్యాట్‌ల లెక్కింపు, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో ఈవీఎంల సమస్య తలెత్తడం ఎంతో తీవ్రంగా పరిగణించాల్సిన అంశమైనప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం కనీసం పట్టించుకోవడంలేదనే విషయాన్ని నేతలంతా ప్రశ్నించనున్నారు.  కనీసం మిగిలిన రెండు దశల్లో జరగనున్న ఎన్నికల పోలింగ్‌లోనైనా ఈవీఎంలు సరిగ్గా పనిచేసే విధానంపై దృష్టి పెట్టాలని కోరనున్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు విషయంలో ఈసీఐ ఎందుకు వెనకడుగు వేస్తోందనే విషయాన్ని నిలదీసే అవకాశం ఉంది. ఎన్నికల్లో సమస్యలపై  విపక్షాలు లేవనెత్తే అంశాలు, ఫిర్యాదులపై సరైన స్పందన లేకుండా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న  తీరును ఎండగట్టేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. తెదేపా అధినేత చంద్రబాబు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఐ నేత డి.రాజా, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి, సీపీఎం నేత నీలోత్పల్‌ బసు, డీఎంకే నేత ఇళంగోవన్‌, జేడీఎస్‌ నేత కుపేంద్రరెడ్డి, టీఎంసీ నేత సుఖేందు సేఖర్‌ రే, ఆర్‌ఎల్డీ నేత అహ్మద్‌ హమీద్‌, ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌, ఐయూఎంఎల్‌ నేత అనిస్‌ ఒమర్‌, ఎన్‌పీఎఫ్‌ నేత కేజీ కెన్యే, ఎల్‌జేడీ నేత జావెద్‌ రజా తదితరులు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను కలవనున్నారు.