తెలంగాణ

కారులో తిప్పుతూ.. చిత్ర హింసలు పెడుతూ..

జూబ్లీహిల్స్: ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదంతో యువకుడిని కొందరు కారులో తిప్పుతూ తీవ్రంగా కొట్టడమే కాకుండా తల వెంట్రుకలు తీయించిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని ఫస్ట్‌ లాన్సర్‌ ప్రాంతానికి చెందిన విద్యార్థి మహ్మద్‌ మన్సూర్‌ అలీఖాన్‌ అలియాస్‌ నసీర్‌(19)కు  సోమవారం ఓ యువతి విషయం మాట్లాడాలని, జీవీకే వన్‌ మాల్‌ వద్దకు రావాలని ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. దీంతో నసీర్‌ అక్కడికి వెళ్లగా ఇబ్రహింఖాన్‌తో పాటు మరికొందరు వచ్చి కారులో బలవంతంగా ఎక్కించుకుని అక్బర్‌బాగ్‌, సైదాబాద్‌కాలనీ తదితర ప్రాంతాల్లో తిప్పుతూ తీవ్రంగా కొట్టారు. ఓ క్షౌరశాలకు తీసుకెళ్లి అతడి తల వెంట్రుకలు తీయించారు. తీవ్రంగా కొట్టడంతో నసీర్‌ ముక్కు నుంచి రక్తస్రావమైంది. ఈ తతంగాన్నంతా వారు చరవాణిలో చిత్రీకరించడంతో పాటు అతని వద్ద రూ. 5వేల నగదు, చరవాణి లాక్కున్నారు. ఆరాంఘర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద అతడిని పడేసి వెళ్లారు. దాడి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇబ్రహింఖాన్‌ తదితరులపై కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.