జాతీయం

కాంగ్రెస్ మీద నమ్మకం లేదు కానీ.. :మోదీ

అహ్మద్‌నగర్‌(మహారాష్ట్ర): ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పార్టీ మీద విమర్శల పర్వాన్ని కొనసాగించారు. ఆ పార్టీకి దేశ ప్రయోజనాలను కాపాడటంపై ఎటువంటి శ్రద్ధ లేదని మండిపడ్డారు. శుక్రవారం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పేదరికాన్ని పారదోలడానికి కాంగ్రెస్‌ను తరమికొట్టండి’ అని ఈ సందర్భంగా కొత్త నినాదాన్ని ఇచ్చారు.

‘గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచం బలమైన ప్రభుత్వాన్ని చూస్తుంది. దానికి ముందు దశాబ్దకాలం పాటు రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రభుత్వం మాత్రమే ఉండేది. అప్పుడు రోజుకో కుంభకోణం గురించి వార్తలు వచ్చేవి’ అని ఆయన కాంగ్రెస్‌ మీద విరుచుకుపడ్డారు. ‘ప్రపంచం ప్రస్తుత ప్రభుత్వం బలమైందని గుర్తించింది. భవిష్యత్‌ ఏంటనేది ఈ ఎన్నికల్లో మీరు నిర్ణయించబోతున్నారు. మీకు నిజాయతీపరుడైన చౌకీదార్ కావాలో, అవినీతి పరుడైన నామ్‌దార్‌(రాహుల్‌ను ఉద్దేశించి) కావాలో మీరే నిర్ణయించుకోవాలి.  హిందుస్థాన్ హీరోలకు ఓటువేయాలో, పాకిస్థాన్ మద్దతుదారులకు ఓటు వేయాలో తేల్చుకోండి’ అని ర్యాలీలో పాల్గొన్న ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావించకుండా కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాల మీద మండిపడ్డారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉండే ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుమతివ్వలేదని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయాలని చూసే,  దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండాలని కోరుకునే పార్టీలకు మద్దతు ఇస్తున్నారని  కాంగ్రెస్‌, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని ప్రధాని దుయ్యబట్టారు. ‘నాకు కాంగ్రెస్‌ మీద ఏ నమ్మకం లేదు కానీ, లెజండరీ ఛత్రపతి శివాజీ జన్మించిన భూమి నుంచి వచ్చిన పవార్‌కు ఏమైంది. ఇంకెంత కాలం నిశబ్దంగా ఉంటారు’ అన్నారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ‘చిన్న తప్పిదం చేసినా ఈ చౌకీదార్ ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందనే భయాన్ని  వారిలో కలిగించాం’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాని పర్యటించిన అహ్మద్ నగర్‌లో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి.