తెలంగాణ

కాంగ్రెస్‌ రేవంత్ కి షాక్..

స్నేహ, హైదరాబాద్‌ : మూడో జాబితాలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ భారీ షాకిచ్చింది. ఆయన వర్గానికి చెందిన ఒక్కరికి కూడా సీటు కేటాయించలేదు. నిజామాబాద్‌ జిల్లాలో తన వర్గానికి కనీసం రెండు సీట్లు అయినా కేటాయించాలని రేవంత్‌ పట్టుపట్టారు. నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి టికెట్లను ఆయన ఆశించారు. తనతోపాటు కాంగ్రెస్‌లో చేరిన నిజామాబాద్‌, కామారెడ్డి టీడీపీ అధ్యక్షులు అరికెల నర్సారెడ్డిని, సుభాష్‌ రెడ్డిలను ఈ నియోజకవర్గాల నుంచి బరిలోకి దించాలని రేవంత్‌ ఆశించారు.

అయినప్పటికీ కాంగ్రెస్‌ ఆ సీట్లను సీనియర్‌ నేతలకు కేటాయించింది. ఎల్లారెడ్డి- జాజల సురేందర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి రేకుల భూపతిరెడ్డిలను బరిలోకి దింపింది. నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ స్థానాలు ఆశించిన టీడీపీకి కూడా కాంగ్రెస్‌ మొండిచేయి చూపింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ నెలకొంది.