జాతీయం

కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యేపై దాడి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని హరచంద్‌పూర్‌లో కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే అదితీ సింగ్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. రాయ్‌బరేలీ పంచాయతీ అధ్యక్షుడు, భాజపా నేత అవదేశ్‌ సింగ్‌ విశ్వాస పరీక్షకు హాజరు అయ్యేందుకు ఆమె వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘రెండు కార్లలో వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. దాదాపు 50 మంది దాడికి ప్రయత్నించారు. వారి చేతుల్లో రాడ్లు ఉన్నాయి.. మాపై రాళ్లు రువ్వారు. మరోవైపు అవదేశ్‌ సింగ్‌ ఓ కారులో కూర్చొని ఉన్నాడు’ అని తెలిపారు.

ఈ దాడి వెనుక రాయ్‌బరేలీ భాజపా లోక్‌సభ అభ్యర్థి, అవదేశ్‌ సింగ్‌ సోదరుడు దినేశ్‌ సింగ్‌ ఉన్నారని అదితీ సింగ్‌ ఆరోపించారు. ‘కొందరు జిల్లా పంచాయతీ సభ్యులు కూడా కొందరు కనపడకుండా పోయారని తెలిసింది. దీనిపై చర్యలు తీసుకుంటాం’ అని పోలీసులు తెలిపారు. విశ్వాస పరీక్షకు 52 మంది సభ్యులు ఆలస్యంగా రావడంతో.. దీన్ని అధికారులు వాయిదా వేశారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో రాయ్‌బరేలీ ఎమ్మెల్యేపై జరిగిన హత్యాయత్నం ద్వారా తెలుస్తోంది. ఆ దాడి ద్వారా భాజపా మరోసారి తమ నిజస్వరూపాన్ని బయట పెట్టింది’ అని పేర్కొంది.