జాతీయం

కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకేనా?

శతాధిక రాజకీయ పక్షమైన కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు అధ్యక్ష సమస్య పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ తన నిర్ణయంపై పట్టువీడట్లేదు. దీంతో కొత్త అధ్యక్షుడిపై సందిగ్ధత నెలకొంది. ఈ రేసులో అప్పుడప్పుడు కొన్ని పేర్లు వినిపిస్తున్నా.. స్పష్టత రావట్లేదు. తాజాగా తెరపైకి సోనియాగాంధీ పేరు వచ్చింది. ప్రస్తుతమున్న కఠిన పరిస్థితుల్లో పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు కోరినట్లు అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ విషయమై ఓ జాతీయమీడియా సోనియాగాంధీని అడగగా ఆమె స్పందించలేదట. అయితే ఆ వార్తలను ఆమె కొట్టిపారేయకపోవడంతో కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియా చేతికి వచ్చే అవకాశాలు లేకపోలేదు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజీనామాపై రాహుల్‌కు నచ్చజెప్పేందుకు సీనియర్‌ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు కర్ణాటక, గోవా లాంటి రాష్ట్రాల్లో హస్తం పార్టీ తన మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడింది. తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడాలంటే సోనియా గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని నేతలు కోరుతున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్‌ నేతలు ఈ విషయమై సోనియా గాంధీని కలిసినట్లు సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఆరోగ్య కారణాల రీత్యా తాత్కాలికంగానైనా తాను పార్టీ బాధ్యతలు చేపట్టలేమోనని సోనియా తన సన్నిహిత వర్గాలకు చెప్పినట్లు సమాచారం. కానీ.. పార్టీ పరిస్థితుల దృష్ట్యా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయని వినికిడి.

1998లో సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 19ఏళ్ల పాటు అధినేత్రిగా సుదీర్ఘకాలం కొనసాగిన ఆమె.. 2017 డిసెంబరులో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం చవిచూసింది. దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్లు ఎంత చెప్పినా రాహుల్‌ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవట్లేదు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక తప్పనిసరి అయ్యింది. అయితే సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని సమాచారం.