జాతీయం

కాంగ్రెస్‌-జేడీఎస్‌కు షాక్‌.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు సోమవారం రాజీనామా చేశారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం సంకట స్థితిలో పడింది. మరోవైపు ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని కాంగ్రెస్‌-జేడీఎస్‌ పేర్కొంటుండగా.. తాజా పరిణామాలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆనంద్‌ సింగ్‌ ఈ ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అక్కడికి కొన్ని గంటల్లోనే రమేశ్‌ జర్కిహోలి కూడా స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ భూములను జిందాల్‌కు కేటాయించడంపై తన నియోజకవర్గ ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆనంద్‌ సింగ్‌ మీడియాకు వెల్లడించారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించానని తెలిపారు. ఆయన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. మరో ఎమ్మెల్యే జర్కిహోలి రాజీనామా ధ్రువీకరించాల్సి ఉంది.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి దీనిపై స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నానని, ప్రభుత్వాన్ని కూలదోయాలన్న భాజపా కల పగటి కలగానే మిగిలిపోతుందని ట్వీట్‌ చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదని కాంగ్రెస్‌ మంత్రి డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. ఆనంద్‌ సింగ్‌ రాజీనామా షాక్‌కు గురిచేసిందన్నారు. మరోవైపు ఆనంద్‌ సింగ్‌ రాజీనామా నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప స్పందించారు. తాము ప్రభుత్వాన్ని కూలదోయాలని చూడడం లేదని, ఒకవేళ ప్రభుత్వం పడిపోతే తాము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టంచేశారు.

కర్ణాటకలో 225 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 80, జేడీఎస్‌ 37 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కావాల్సిన 113 స్థానాలకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అధికంగా ఉన్నారు. తాజా రాజీనామాలతో ప్రభుత్వ బలం 115కు పడిపోయింది. మరోవైపు భాజపాకు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.