జాతీయం

కశ్మీర్ ను విడిచిపెట్టివెళ్లాలని హెచ్చరికలు జారీ

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులు, ఇతర పర్యాటకులు వెంటనే తిరుగుముఖం పట్టాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం సూచించింది. అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యాటకులపై, ప్రత్యేకంగా అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర మూకలు దృష్టి సారించినందున వీలైనంత త్వరగా వెనుదిరగాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో హెచ్చరించింది.

అమర్‌నాథ్‌ యాత్రలో హింసను సృష్టించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నిందని కొంత సేపటి క్రితం భారత ఆర్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దారిలో కొన్ని చోట్ల మందు పాతరలు, స్నిపర్‌ రైఫిళ్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆయుధాలపై పాకిస్థాన్‌ ఆయుధాగారానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఇంకా గాలింపు చర్యలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కుట్రకు పాక్‌ ఆర్మీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని తెలిపారు. ఇక్కడ అశాంతి నెలకొల్పాలనే పాక్‌ సైన్యం ప్రయత్నాలను సాగనీయబోమని హెచ్చరించారు.

జమ్మూకశ్మీర్ లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు వెంటనే స్వస్థలాలకు వెళ్లిపోవాలని అక్కడి పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు అమర్ నాథ్ యాత్రికులతో పాటు ఇతరుల్ని లక్ష్యంగా చేసుకోవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతోనే ఈ ఆదేశాలు జారీచేసినట్లు పాలనా యంత్రాంగం సృష్టం చేసింది. దీంతో శ్రీనగర్ నిట్ కాలేజీతో పాటు వందలాది సంఖ్యలో పర్యాటకులంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం రద్దీగా మారిపోయింది. అయితే అదే సంఖ్యలో విమానాలను ఎయిర్ లైన్స్ కంపెనీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలంతా పడిగాపులు కాస్తున్నారు. వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు.

జమ్ముకశ్మీర్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్ ను విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భయాందోళనకు గురైన విద్యార్థులు తమకు సాయం చేయలంటూ ట్విటర్ లో టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కష్టాలపై కేటీఆర్ వెంటనే స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థులను శ్రీనగర్ నుంచి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను కేటీఆర్ కోరారు.