జాతీయం

కరుణ మనవడి ఆస్తుల జప్తు

చెన్నై: కరుణానిధి మనవడు, అళగిరి కుమారుడైన దయానిధి అళగిరికి చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆయనకు చెందిన  సంస్థ ఒలింపస్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించి చెన్నై, మదురైలోని రూ.40.34 కోట్ల స్థిర, చరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. మనీ లాండరింగ్‌ చట్టం కింద అక్రమ మైనింగ్‌ కేసులో ఈ మేరకు జప్తు చేసినట్లు బుధవారం ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సదరు సంస్థ యజమాని దయానిధి అళగిరి, వాటాదారుడు ఎస్‌ నాగరాజన్‌ తాము తీసుకున్న లీజు ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూర్చే చర్యలకు పాల్పడటంతో పాటు సొంతంగా లబ్ధి పొందారు. ఆ మేరకు ఒలింపస్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ డైరెక్టర్‌, వాటాదారులపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించగా అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని వెల్లడైంది. పలువురిని కమీషన్లు, ఇతర విధాలుగా ప్రలోభాలకు గురి చేసి అక్రమంగా మైనింగ్‌ కార్యకలాపాలు సాగించారని తేలింది. ఆ మేరకు ఆ సంస్థకు చెందిన రూ.40.34 కోట్ల విలువైన 25 స్థిర, చరాస్తులను జప్తు చేస్తున్నాం’ అని ఈడీ అధికారులు వెల్లడించారు. ఇందులో మదురై, చెన్నైలోని పలు భవనాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు.