అంతర్జాతీయం

కన్నయ్యకు సినీ ప్రముఖుల మద్దతు

ముంబయి: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌కు బాలీవుడ్‌ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కన్నయ్య బెగుసరాయ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ కన్నయ్యకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. స్వరా కూడా జేఎన్‌యూలో విద్యనభ్యసించారు. మంగళవారం స్వర 31వ పుట్టినరోజు సందర్భంగా కన్నయ్య కోసం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో సమావేశమయ్యారు. ‘కన్నయ్య నాకు స్నేహితుడు. మన అందరికీ ఎంతో ముఖ్యమైన అంశంపై అతను పోరాడుతున్నాడు. అతను గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లే. నేను గతంలో ఎలాంటి రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. భారతీయులు అనుభవిస్తున్న అన్ని సమస్యలపై కన్నయ్య గళమెత్తుతున్నారు. కాబట్టి ఆయన సిద్ధాంతాలను ప్రజలు అర్థంచేసుకోవాలి’ అన్నారు.
స్వరనే కాదు సినీ ప్రముఖులు జావేద్‌ అక్తర్‌, ఆయన సతీమణి షబానా అజ్మీ కూడా కన్నయ్యకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆయన కోసం బిహార్‌ నుంచి ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.