క్రైమ్

కత్తితో భార్య, అత్తమామలపై దాడి

చెరుకుపల్లి గ్రామీణం: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి.. తన భార్య, అత్త, మామలపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై కత్తితో నరకడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన బొప్పుడి వెంకట్రావు.. మామ అనగాని రామకృష్ణ ఇంట్లోనే భార్యతో కాపురం ఉంటున్నాడు. కుటుంబంలో గత కొంతకాలంగా కలహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెంకట్రావు కత్తి తీసుకొని నిద్రిస్తున్న వారిపై దాడి చేశాడు. తల, మెడపై విచక్షణా రహితంగా నరకడంతో తీవ్రగాయాలయ్యాయి.

రక్తం కారుతూ మామ రామకృష్ణ ఇంటి నుంచి బయటకు వచ్చి కేకలు వేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరుకుపల్లి ఎస్సై బి.అశోక్‌కుమార్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రాకను గమనించిన వెంకట్రావు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో రేపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యుల సూచనల మేరకు గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. భార్య అనిత పరిస్థితి విషమంగా ఉండగా, అత్త మంగమ్మ కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన అల్లుడితో పాటు మరో ఇద్దరు ఈ దాడికి పాల్పడినట్లు మామ రామకృష్ణ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.