క్రైమ్తెలంగాణ

కత్తితో కోర్టుకు వచ్చిన నిందితుడు

నాంపల్లి: అతడో విద్యార్థి.. కానీ పలు నేరాల్లో నిందితుడు.. దీంతో పోలీసులు అతడిపై రౌడీషీట్‌ నమోదు చేశారు.. చివరికి కోర్టుకు సైతం జేబులో కత్తి పెట్టుకుని వెళ్లి మళ్లీ పోలీసులకు చిక్కాడు.నిందితుడిని నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో భద్రతా సిబ్బంది గుర్తించి  పోలీసులకు అప్పగించారు. నాంపల్లి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌చంద్రబోస్‌, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. రాజ్‌భవన్‌ రోడ్‌, ఎం.ఎస్‌.మక్తా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ మొహినుద్దీన్‌ (19) హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 2018 సంవత్సరంలో సైఫాబాద్‌లో జరిగిన ఓ హత్య కేసులో మహ్మద్‌ మొహినుద్దీన్‌ నిందితుడు. అంతేకాకుండా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇతడిపై రౌడీషీట్‌ కూడా నమోదై ఉంది. ఇటీవల ఒకరిని బెదిరించి డబ్బులు కాజేసిన కేసులో హబీబ్‌నగర్‌ పోలీసులు మహ్మద్‌ మొహినుద్దీన్‌ను రిమాండ్‌కు తరలించగా బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసుకు సంబంధించి బుధవారం నాంపల్లి మెట్రోపాలిటన్‌ కోర్టులోని 16వ ఏసీఎంఎం కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వచ్చాడు. కోర్టు ప్రధాన ప్రవేశ మార్గం వద్ద పోలీసులు తనిఖీ చేయగా అతడి జేబులో పొడవాటి కత్తిని గుర్తించారు. మహ్మద్‌ మొహినుద్దీన్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు నాంపల్లి పోలీసులు పేర్కొన్నారు.